Monday, February 15, 2010

అవగాహన!


పనికి వచ్చిన మనిషితో
సరిపడా ఊడిగం
చేయించుకునే వరకు
నిద్రపట్టని సమాజం!

పని విలువ బాగానే తెలుసు
మనుషులకి!

నెలజీతం ఇచ్చేటపుడు
రోజు తక్కువ నెలజీతం
ఏంటని అడిగితే...
ఏరోజు పనికి రాలేదో
గుర్తురావడానికి అరనిమిషమే!

ఆహా... ఏమి ఖచ్చితత్వం!
సంతోషమే...
డబ్బు విలువా బాగానే తెలుసు
మనుషులకి!

మరి ఇదేంటి?
సందేహం కాదు ఆక్రోశం!

ప్రజలు అసలు మనుషులేనా?
ఐదేళ్ళకి సరిపదా
పనులు అప్పజెప్పి
నిమ్మకుండటంలో
మర్మమేమిటో?

ఆలోచించడం అనవసరం
అని 'అరనిమిషం' లో
తేల్చేవారిని చూస్తే
అవును మనుషులేనన్న స్పౄహ!

మార్పు సహజం!

అలా కాకుండా
మనకు మనంగా
ఎన్నటికీ మారబోమనుకుంటా!
====================

ఎందుకు వ్రాసానంటే: చెప్పాలిన అవసరం నాకు ఏమాత్రం లేదు!

వామ్మో స్నేహితుడు!


అటువి ఇటు ఇటువి అటు
అన్నీ గాల్లో లెక్కలు
తీరుస్తాననుకుని
చేసే అప్పు
తీర్చాలనుకుని
మళ్ళీ కొత్త లెక్కలు

అయినా!

తెచ్చుకున్న డబ్బులకీ రెక్కలు!!
ఎందుకూ?
తీర్చే బాధ్యత గాలికేనా?
అబ్బే అదేం లేదు
మన చేతికి ఎముక లేదు
తీర్చేవరకు కుడా ఏమీ ఆగదు

అదంతే!
స్నేహబంధం కదా!
చెప్పడానికి ఎన్నో ఉన్నాయి
అర్థం చేసుకొవడానికీ ఉన్నారు

అర్థం చేసుకొక తప్పుతుందా!
'ఉన్నవారికే' తలకెక్కదు
లేనివారికి ఒక్కొక్కటిగా అర్థం అవుతాయ్
అన్నీ అర్థం అవుతాయ్
మెల్లిగా స్నేహలూ దూరమవుతాయ్
మొహం చాటేస్తాయ్

తీర్చాలనుకుని
తీరుస్తాననుకుని
తీర్చలేకపొయేవాడికే
ఇవన్నీ బాధలు!

అసలు తీర్చే ఉద్దేశమే
లేనివాడికి?
ఆయ్...పిచ్చి లైట్!
స్నేహితులే కదా
అర్థం చేసుకుంటారు

చేసుకోక తప్పుతుందా!!
==============

ఎందుకు వ్రాసానంటే:

ఏ విషయం అయినా మితిమీరనంతవరకి మంచిదే అంటారు. కాకపోతే, కొందరు తమకంటూ ఒక పరిమితికి లోబడి ఉంటారు. మరికొందరు అపరిమితం పరిమితంగా కలిగి ఉంటారు. :) కానీ, ఇతరుల విషయంలో మాత్రం ప్రతీ ఒక్కరికీ ఒక పరిమితి ఉంటుంది. అపరిచితులూ, పరిచితులూ, వీరిద్దరికి మనం ఒక్కొక్క పరిధిలో మితిమీరకూడదనుకుంటే, స్నేహితులు మాత్రం 'ఇక భరించడం నా వల్ల కాదూ అని అలసిపొయె వరకు మన కోసం ఎదైనా చేస్తారు. దానికీ ఒక పరిమితి ఉంతుందని మనం గుర్తించగలిగితే, మనతో పెనవేసుకుపొయే బంధాలకి పరిమితి ఉండదు. :)

ఈ రోజుల్లో, జీవితంలో బంధాలని అత్యంతంగా ప్రభావితం చేసేది ఇదీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా డబ్బు మాత్రమే! ఆ విషయంలో అంతే ఖచ్చితంగా వ్యవహరించడం అవసరమని నొక్కిచెబుతూ... అది స్నేహాలని ఏవిధంగా ప్రభావితం చేస్తుందో, ఒక స్నేహితుడిగా నువ్వు ఏమి చేయకుందా జాగ్రత్తపడాలో చెప్పే ప్రయత్నంలో భాగంగా...! :-)

దురుద్దేశం లేదు
సదుద్దేశమూ లేదు

ఉన్నదల్లా ఒకటే
ఎవరూ ఇబ్బంది పడద్దు!
నువ్వు ఇబ్బంది పడుతూ
అందరినీ ఇబ్బంది పెడుతూ
కాలాన్ని వెళ్ళదీయొద్దు!!

స్నేహితులు దారి తప్పితే
స్నేహాలూ దారి తప్పుతాయని
ఈ ప్రయత్నం!
తప్పక ఆదరిస్తారనే ఆత్రం!! :-)


అయోమయం!!


నీ స్టీరింగ్ నీ చేతిలొనే!
అది లాక్కునే ధైర్యం ఎవరికైనా ఉందెమో!!
నాకు మాత్రం లేదు!

ఎందుకంటే అది లైఫ్ స్టీరింగ్ అని తెలుసు
నువ్వే కాకుండా నీతో పాటు
అమ్మా నాన్న 'వగైరా' ఉన్నారనీ తెలుసు
'వగైరా' లో నీమీద నమ్మకం ఉన్నవాళ్ళందరూనూ
అందుకే! నాకు మాత్రం ఆ ధైర్యం లేదు

స్టీరింగ్ నీ చెతిలొనే ఉంది
ఆలోచించుకో!
ఎటు వెళ్ళదలచుకున్నవో
ఎటు వెళ్తున్నావో
అసలు వెళుతున్నావో లేదో!

మొదలెట్టకుండానే స్టీరింగ్ తిప్పుతూ
బాగానే నడుపుతున్నాననుకుంటున్నావో
ఇప్పటికి ఇదే బావుందనుకుంటున్నావో
పరిస్థితులని తప్పించుకు తిరుగుతున్నావో!!

నింపాదిగా నడిపి
గమ్యం చేరదామనుకుంటే పర్లేదు
అసలు నడపకుంటేనే సమస్యంతా!


ఎందుకు వ్రాసానంటే: ఇది ఒక స్నేహితుడిని ఉద్దేశించినది. కానీ, తీరా ఒకసారి చదువుకున్నాక ఎందుకో నా మనసు చివుక్కుమంది. తరచి చూస్తే ఇది నా గురించే...! మా అన్నయ్య నాతో అన్న మాటలన్నీ ఇందులో ప్రతిఫలించాయని...!!